14 Jul 2009

హై .. హై.. హైక్

మేనేజర్ పిలిచింది. అసలే బ్రేక్ అవుట్ ఏరియాలో క్యారమ్స్ స్ట్రైకర్ కనిపించట్లేదని ఆఫీస్ లో అందరూ బాగా కంగారుగా ఉన్నాము. నరేష్ గాడిని అనుమానిద్దామా అంటే..వాడు మా కంపెనీ కాదు. అయ్యిందేదో అయ్యింది.. ఇక ఆడటం మానేసి,కొంచం కష్టమైనా సరే ఆఫీస్ పని చేద్దాం అని డిసైడ్ అయ్యి ఎవరి క్యుబికల్ కి వాళ్లు వెళ్లిపోయాం. ఇంతలో ఈవిడ పిలిచింది. అసలే రిసెషన్ ..ఏ బాంబు పేలుస్తుందో ఏమొ అని భయపడుతూ, లాప్ టాప్ wallpaperలో ఉన్న ఐశ్వర్యరాయ్ ఫోటోని, మొబైల్ wallpaperలో ఉన్న గర్ల్ ఫ్రెండ్ ఫోటోని కళ్లకద్దుకుని మా మేనేజర్ దగ్గరికి వెళ్లాను.

"హాయ్ భరత్ !! Last year నీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడటానికి పిలిచాను. బాగా వర్క్ చేశావ్. ఇంకా బాగా వర్క్ చేయాలి. అలాగే నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి assertiveness..taking ownership..leadership skills..." అంటూ నాకు అర్థంకాని నాలుగైదు పదాలు చెప్పింది. చివరగా.."నీ పర్ఫార్మెన్స్ కి మెచ్చి కంపెనీ నీకు భారీగా హైక్ ఇచ్చింది." అని అంది.

అప్పటి వరకు చెప్పిన విషయాల్లో "భారీగా" అన్న మాట తప్ప నాకు ఇంకేదీ వినిపించలేదు. వెంటనే జేబులో ఉన్న ఆకు, వక్క తీసి మేనేజర్ ముందు పెట్టి, చేతిలో కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాను. నా భక్తికి పరవశించిపోయి మా మేనేజర్ కళ్లనీళ్లు పెట్టుకుంటూ ఇదిగో నీకు వచ్చిన 0.01545% హైక్ అని ఒక ఎన్వలప్ చేతిలో పెట్టింది. నా చేతిలో వెలుగుతున్న కర్పూరం మేనేజర్ చేతిలోకి ట్రాన్స్‌ఫర్ చెయ్యటం.. మరో జేబులో ఉన్న కత్తి తీసి టేబుల్ మీద గుచ్చటం.. నేను టేబుల్ పైకి ఎక్కటం.. మూడూ ఒకేసారి జరిగాయి. ఎక్కిన వాడిని ఊరికే ఉండకుండా, ఆర్.నారాయణమూర్తి సినిమాలో సైడ్ డ్యాన్సర్స్‌లాగా పూనకం వచ్చినట్టు ఎగిరాను. దెబ్బకి మేనేజర్ టేబుల్ కింద దాక్కుంది. కాసేపటికి టేబుల్ కిందనుంచే తెల్ల ఖర్చీఫ్ ఊపుతూ , "భరత్!! పైనుంచి అంతే విదిల్చారు. నేను ఇంతకంటే ఏం చెయ్యలేను" అంటూ నేను ఇచ్చిన ఆకు, వక్క మళ్లీ నా చేతిలో పెట్టింది. ఇక చేసేదేమి లేక నా క్యుబికల్‌కి వచ్చేశాను.

అయినా నాలో నిద్రపోతున్న ఎర్ర సినిమా హీరో మేల్కొనడానికి కారణం నాకు తక్కువ హైక్ వచ్చినందుకు కాదు. ఎప్పుడూ వర్క్ ఫ్రం హోం చేస్తూ అప్పుడప్పుడు ఆఫీస్‌కి వచ్చి కష్టపడి క్యారమ్స్ ఆడుతూ వీలైనప్పుడు వర్క్ చేసే నాకంటే, రోజుకు 26 గంటలూ ఆఫీస్ పని మాత్రమే చేసే నా కొలీగ్ కి ఎక్కువగా .. అంటే 0.02406% ఇచ్చింది. ఆ అవమానాన్ని భరిస్తూ తనతో కలిసి పని చెయ్యటంకంటే పక్క టీంకి వెళ్లిపోవడం మంచిదనిపించింది. కాని ఆ టీంలో అందరూ రోజుకి 28 గంటలు ఆఫీస్ పని చేస్తారని తెలిసి నా ఆలోచనని వచ్చే రిలీజ్‌కి డిఫర్ చేసి ఇక ఈసారి ఎలాగైనా సరే నా కొలీగ్ ని అంతసేపు పనిచెయ్యించకూడదని ప్రతిజ్ణ చేశాను.

ఈ "భారీ" హైక్‌లతో ఆఫీస్ అంతా గందరగోలంగా ఉంది. డిప్రెషన్‌లో ఎవరికి తోచిన పని వాళ్లు చేస్తున్నారు. ఒకడు నెట్‌వర్క్ కేబుల్‌తో ఉరేసుకోవడానికి ట్రై చేస్తుంటే మరొకడు అంత కష్టం ఎందుకని కిందికెళ్లి కాంటీన్‌లో లెమన్ రైస్ తెచ్చుకున్నాడు.

ఇవన్నీ చూసి బెంగళూరులో నేను కొన్న "ఆత్మహత్యకు అరవై దారులు" పుస్తకం గుర్తొచ్చింది. అందులో కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకోవటానికి చిత్ర విచిత్రమైన దారులు ఇచ్చాడు. ఉదాహరణకి ,"బేగంపేట్ ఆనంద్ థియేటర్ దగ్గర రోడ్ క్రాస్ చెయ్యటం ద్వారా". ఇది మాత్రం నిజం. కావాలంటే అక్కడ ID కార్డ్స్ ని అడ్డంగా వేసుకొని తిరిగే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లని అడగండి(ఎవరో అర్థమైందనుకుంటా? :-)). మామూలుగా అక్కడ ఇటువైపునుంచి అటువైపుకు రోడ్ క్రాస్ చెయ్యటానికి పది నిమిషాలు పడుతుంది. అదే మాంచి పీక్ టైం లో అయితే అర్థగంటలో దాటెయ్యొచ్చు. విశేషమేంటంటే,అందమైన అమ్మాయితో కలిసి క్రాస్ చేస్తున్నారనుకోండి 100kmph స్పీడ్ లో వచ్చేవాడు 20kmphకి తగ్గించి అమ్మాయి దాటగానే మళ్లీ 100కి పెంచి, అమ్మాయికి చిన్న స్మైల్ ఇచ్చి, పనిలోపనిగా మనల్ని గుద్దేసి వెళ్లిపోతాడు. కాబట్టి .. ఈసారి మీ గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి అక్కడ రోడ్ క్రాస్ చెయ్యటానికి ట్రై చెయ్యండి. తను అందంగా ఉందో లేదో తెలిసిపోతుంది. ;-)

సరే సరే .. బ్యాక్ టు ఆఫీస్...ఈ గందరగోలంలో అనౌన్స్‌మెంట్ స్పీకర్‌నుంచి ఖతర్నాక్ సినిమాలోని "దోమ కుడితె చికన్ గునియా..ప్రేమ పుడితె సుఖంగునియ"అనే పాట మొదలైంది. ఈ పాట పెట్టారంటే ఖచ్చితంగా అగ్ని ప్రమాదం,భూకంపం కంటే పెను ప్రమాదం జరిగుంటుందని అందరికి అర్థమైంది. అంతే, బాలక్రిష్ణ సినిమా ఇంటర్వెల్‌లో గేట్లు తీసినప్పుడు ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయినట్టు, ఆఫీసులో దిక్కుకొకరు పరుగెత్తారు. ఇదే కరెక్ట్ టైం అని సగం మంది బ్యాగు మొత్తం సర్దుకొని పరుగెత్తారు. ఆ సగం మందిలో నేను ఉన్నానో లేదో చెప్పుకోండి చూద్దాం?

కాసేపటికి పాట ఆగిపోయి మరో అనౌన్స్‌మెంట్ వచ్చింది. "క్షమించాలి.. ఇందాక మీరు అలర్ట్‌గా ఉన్నారో లేదో టెస్ట్ చెయ్యటానికి ఆ పాట పెట్టాము. ఎవరి పనులు వారు చేసుకోవచ్చు." . హమ్మయ్య.. దాసరి నారాయణరావు స్పీచ్ ఇస్తున్నప్పుడు కరెంట్ పోతే కలిగే అమితానందం అందరి ముఖంలో కనిపించింది.( పాట పెట్టిన వాడిని ఆ తర్వాత బయటకు లాగి చితకబాదారు.. అది వేరే విషయం..)

అయినా బ్యాగు సర్దుకొన్న తర్వాత కూడా మళ్లీ వెనక్కు వెళ్లి ఆఫీస్‌లో కూర్చునేంత అమాయకుడిని కాదు నేను. అందుకే, సర్దుకొన్న బ్యాగు సంకలో పెట్టుకొని ఇంటికెళ్లిపోతున్నా.. వర్క్ ఫ్రం హోం చెయ్యటానికి.. ఉంటా :-)

3 comments:

Mohan Vamsi Krishna A said...

Entha hike annadi mukyam kaadu, hike vachinda leeda andi important..

It deserves a party!!
Title baavundi..mayabajar cinemala..
- Mvk

Mohan Vamsi Krishna A said...

post title kana baavundi..

Naresh Kareti said...

Vamsi gani telugu gani nuvvu chadivinavante....next blog lo anni boothule rastavu...zara jagratha bhai...
Blog kathi la undhi...